తల్లిదండ్రుల జ్ఞాపకాలకు.. సేవా స్మారకం!
హనుమాన్ ఆలయానికి రూ.24 వేలతో కమాన్ నిర్మించిన తోట కుటుంబం.
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
తల్లిదండ్రుల జ్ఞాపకాలను పదిలపరుచుకోవడంతో పాటు గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తనుగుల గ్రామానికి చెందిన ఓ కుటుంబం చేపట్టిన సేవా కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంది. జమ్మికుంట మండలంలోని తనుగుల గ్రామానికి చెందిన స్వర్గీయ తోట రాయలింగు–ఆగమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి వారసులు హనుమాన్ దేవాలయం వద్ద రూ.24 వేల వ్యయంతో ఇనుప కమాన్‌ను నిర్మించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ కమాన్‌ను రహదారి ద్వారం వద్ద ఏర్పాటు చేశారు.
గతంలో మెయిన్ రోడ్డు నుంచి హనుమాన్ దేవాలయం వరకు సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్న సమయంలో గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు తోట రాయలింగు–ఆగమ్మ కుటుంబ సభ్యులు రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అందించారు. ప్రస్తుతం వారి జ్ఞాపకార్థం దేవాలయ ప్రవేశద్వారం వద్ద కమాన్ ఏర్పాటు చేయడం ద్వారా తమ కుటుంబానికి గ్రామంతో ఉన్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జక్కే కిరణ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి, ప్రజా సేవకు తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో తోట కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ.. తోట కుటుంబ సభ్యులు గతంలోనూ గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లు అందించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో గ్రామ పురోహితులు వల్లూరి పవన్ కుమార్, విష్ణు అయ్యగారు, వాసాల సుధీర్, దేవేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, యాదకిషన్, రాజు, దాసారపు రాజయ్య, ప్రశాంత్, సంజీవ్, సంపత్, కొమురయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, దాత కుటుంబ సభ్యులు తోట రాజు, సరిత, లక్ష్మీ ప్రియ, ఈశ్వర్ కార్తీక్, స్వరూప, కౌటమ్ రాజ్ కుమార్, అంజలి తదితరులు పాల్గొన్నారు.


Comments