దళితబంధు నిధులకు కదలిక.. త్వరలో విడుదల ప్రక్రియ.
జమ్మికుంటలో కీలక ప్రకటన చేసిన వొడితల ప్రణవ్.
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
దళితబంధు పథకం లబ్ధిదారులకు త్వరలోనే నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభిస్తామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రకటించారు. దళితుల సంక్షేమం, అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు.
ఆదివారం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్‌లో మాదిగ మహాశక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, వొడితల ప్రణవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఈ అంశంలో ముందడుగు వేశామని తెలిపారు. దళిత స్పీకర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం, ఆయన పర్యటించిన ప్రాంతాన్ని శుద్ధి పేరుతో పసుపునీటితో శుభ్రం చేయడం వంటి ఘటనలపై బీఆర్ఎస్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.
గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ప్రణవ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పెండింగ్‌లో ఉన్న దళితబంధు లబ్ధిదారుల అంశంపై దృష్టి సారించి, 2025లో గ్రౌండింగ్ ప్రక్రియను తిరిగి చేపట్టామని తెలిపారు.
దళితబంధు నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు కొనసాగుతున్నాయని ప్రణవ్ వెల్లడించారు. ఆయన ప్రకటనతో దళితబంధు లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ.. దళితబంధు నిధుల విడుదల కోసం వొడితల ప్రణవ్ మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులను కలిసి కృషి చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో మాదిగ మహాశక్తి నిర్వాహకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, దళితబంధు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments