ప్రజా అవసరాలే ప్రథమ ప్రాధాన్యం.
*12వ డివిజన్‌లో అభివృద్ధికి మరో అడుగు*
*తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్*
కరీంనగర్, సెప్టెంబర్ 13(తెలంగాణ ముచ్చట్లు ):
నగరపాలక సంస్థ పరిధిలోని 12వ డివిజన్ హస్నాపూర్ ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న హెచ్‌డీపీఈ పైప్‌లైన్ నిర్మాణ పనులకు ఘనంగా శంకుస్థాపన చేశారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ–వేణుతో కలిసి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. డివిజన్ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పైప్‌లైన్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి, ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.
ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందించడంతో పాటు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


Comments