*చెత్త బండ్ల నిర్వహణపై నిర్లక్ష్యమా..?
* 30 వార్డుల్లో పారిశుధ్య సేవలకు ఆటంకం..
* మున్సిపల్ చైర్మన్‌కు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ వినతి
జమ్మికుంట, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణకు వినియోగిస్తున్న చెత్త బండ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆరో వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ మున్సిపల్ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని 30 వార్డుల్లో ప్రతిరోజూ పారిశుధ్య సేవలు అందించాల్సి ఉండగా, చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా నడవకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే మొత్తం 23 చెత్త సేకరణ వాహనాలు ఉండగా, ప్రస్తుతం కేవలం 12 వాహనాలు మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. వాహనాల సర్వీసింగ్ కోసం మున్సిపల్ నిధులు కేటాయించినప్పటికీ, అన్ని వాహనాలకు పూర్తిస్థాయిలో సర్వీసింగ్ చేయించలేదని ఆరోపించారు. దీంతో కొంతకాలంగా వినియోగంలో లేని వాహనాల ఇంజిన్లు సీజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అదేవిధంగా చెత్త సేకరణ వాహనాల కోసం 10 టైర్లు తెప్పించినప్పటికీ, అవి నడవని వాహనాలకు అమర్చినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పట్టణ పారిశుధ్యానికి చెత్త సేకరణ వ్యవస్థ కీలకమైనందున ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేపట్టి, అవసరమైన అన్ని వాహనాలకు సర్వీసింగ్ చే
యించి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
పట్టణ ప్రజలకు ప్రతిరోజూ అవసరమైన పారిశుధ్య సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్‌ను కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ కోరారు.


Comments