సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు.
సత్తుపల్లి, సెప్టెంబరు 15 (తెలంగాణ ముచ్చట్లు):
బి గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డే వేడుకలను మంగళవారం కళాశాల యాజమాన్యం, ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇంజనీరింగ్ అన్ని విభాగాలతో పాటు డిప్లొమా, ఎంబీఏ విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబరు 15న ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ రంగంలో విశ్వేశ్వరయ్య అందించిన సేవలు దేశ, విదేశాల్లో భారతీయుల ప్రతిభను చాటిచెప్పాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ.. సర్ ఎం. విశ్వేశ్వరయ్య జీవిత ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన నిస్వార్థ సేవలు ఆదర్శనీయమన్నారు. ఆనకట్టలు, వంతెనలు, సాగునీటి, తాగునీటి పథకాల రూపకల్పనలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు రూపొందించిన వ్యవస్థ, విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి కాపాడే చర్యల్లో ఆయన సేవలను గుర్తుచేశారు. కృష్ణరాజసాగర్ ఆనకట్ట నిర్మాణంతో పాటు భద్రావతి ఇనుము, ఉక్కు కర్మాగారం, మైసూరు చందనపు నూనె కర్మాగారం, బ్యాంక్ ఆఫ్ మైసూరు స్థాపనలో ఆయన పాత్రను వివరించారు. 1955లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను అందుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మసంతృప్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్ మాట్లాడుతూ.. ఇంజనీర్స్ డే కేవలం ఇంజనీర్లను గౌరవించే రోజు మాత్రమే కాదని, జ్ఞానం, ఆవిష్కరణలు, కష్టపడి పనిచేసే నిబద్ధత సమాజాన్ని మార్చగలవనే విషయాన్ని గుర్తుచేసే రోజని అన్నారు. సర్ ఎం. విశ్వేశ్వరయ్య నిజాయితీ, అంకితభావం, క్రమశిక్షణ, దేశసేవ వంటి విలువలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. యువతలోని ప్రతిభ, సృజనాత్మకతను ప్రోత్సహించి మెరుగైన భవిష్యత్తు కోసం వినూత్న పరిష్కారాలను రూపొందించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యుడు, సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ బండి అన్విద వర్చువల్‌గా పాల్గొని ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, వివిధ ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు, డిప్లొమా డీన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బలుసుపాటి సీతారాములు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.


Comments