పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యే లక్ష్యం.
*యాదవులపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్*
*నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన డా. కవ్వంపల్లి*
కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత నివాస విద్య అందించడమే లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి గ్రామంలో సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను ఆయన సంబంధిత ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి రాజీకి తావులేకుండా పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకు సమానమైన, అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.


Comments