టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
*పైపుల కంపెనీలకే అవకాశం కల్పించేలా నిబంధనలు*
*అధికారులపై చర్యలు తీసుకోవాలి: హరిప్రసాద్*
కరీంనగర్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ నగరపాలక సంస్థలో టెండర్ల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. డి.బి. సెక్షన్ నిబంధనలు ప్రతిసారీ వివాదాలకు తావిస్తున్నాయని, ప్రస్తుతం పిలిచిన వాటర్ పైప్‌లైన్ టెండర్‌లో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు కాకుండా పైపుల తయారీ సంస్థలకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు రూపొందించారని ఆయన విమర్శించారు.
గతంలో సుమారు రూ.45 లక్షల విలువైన ఇదే తరహా పైప్‌లైన్ పనిని తయారీదారు అనే నిబంధన లేకుండా టెండర్ నిర్వహించగా సుమారు 28 శాతం తక్కువకు టెండర్ దక్కిందని, దీంతో నగరపాలక సంస్థకు సుమారు రూ.12 లక్షల మేర ఆదా జరిగిందని హరిప్రసాద్ పేర్కొన్నారు. అదే పనికి సంబంధించిన ప్రస్తుత టెండర్‌లో నిబంధనలు ఎందుకు మార్చారో అధికారులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నిబంధనల మార్పు వెనుక ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
టెండర్లలో పోటీని పరిమితం చేసే నిబంధనలు విధించడం వల్ల ప్రజలకు, నగరపాలక సంస్థకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. నిబంధనల మార్పు మేయర్, కమిషనర్‌కు తెలిసే జరిగిందా? లేక ఇంజనీరింగ్ అధికారుల స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టెండర్ ప్రక్రియను నిలిపివేసి, ఎక్కువ మంది అర్హులైన కాంట్రాక్టర్లు పాల్గొనే విధంగా నిబంధనలు రూపొందించాలని కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వకపోతే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


Comments