24 గంటల్లో హత్య కేసు ఛేదన.
* చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్న జమ్మికుంట పోలీసులు
జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
భూ వివాదం నేపథ్యంలో తనుగుల గ్రామంలో జరిగిన హత్య కేసును జమ్మికుంట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి, ఘటనకు సంబంధం ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. తనుగుల గ్రామానికి చెందిన బొజ్జపల్లి రాజబాబుకు తన తల్లి లచ్చమ్మకు చెందిన భూమి విషయంలో కుటుంబ సభ్యులతో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. భూమిని విక్రయించాలని రాజబాబు కోరగా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భూమిని మూడు వాటాలుగా పంచాలని నిర్ణయించినప్పటికీ, రాజబాబు మొత్తం భూమి తనకే చెందాలని పట్టుబట్టినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 10న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాజబాబు మద్యం సేవించి తనుగులలోని తన బావ జూపాక శంకర్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న తన తల్లి లచ్చమ్మ, అక్క కవితతో గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో రాజబాబు తన తల్లి వెంట్రుకలు పట్టుకుని లాగడంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చినట్లు పేర్కొన్నారు.
అప్పటికే మద్యం సేవించి ఉన్న జూపాక శంకర్, చేతి వెంకటేష్, మారపెల్లి రాజయ్య, జూపాక సతీష్ తదితరులు రాజబాబును పట్టుకుని కొట్టి మంచంపై పడవేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అతని చేతులు, కాళ్లను మంచానికి కట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జూపాక శంకర్ చున్నీతో రాజబాబు మెడను బిగించడంతో అతడు మృతి చెందినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు..
రాజబాబు మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఘటనను దాచిపెట్టేందుకు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టినట్లు పోలీసులు తెలిపారు. అదే రాత్రి మృతదేహాన్ని సైకిల్‌పై తనుగుల గ్రామ శివారులోని పొలానికి తరలించి, అక్కడ పార, గడ్డపారలతో గుంత తవ్వి పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం మట్టితో పాటు తుమ్మ పొరకతో కప్పి ఎవరికి అనుమానం రాకుండా చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలీసుల స్వాధీనంలో వస్తువులు
కేసు దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పూడ్చేందుకు ఉపయోగించిన పార, గడ్డపార, మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన సైకిల్, రాజబాబు మెడ బిగించేందుకు ఉపయోగించిన చున్నీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత గొడవల విషయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరమైన మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలని జమ్మికుంట పోలీసులు సూచించారు.


Comments