మల్కాపూర్‌లో విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన.
నేల తల్లి ఆరోగ్యం తెలుసుకుందాం
– స్థిర వ్యవసాయానికి బాట వేద్దాం
చిల్పూర్, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పాఠశాల భూసార ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో నేల ఆరోగ్యం, భూసార పరీక్షల ప్రాధాన్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఘన్‌పూర్ స్టేషన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు అపర్ణ మాట్లాడుతూ రైతులు విచక్షణారహితంగా ఎరువులు వినియోగించడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భూసార పరీక్ష చేయించడం ద్వారా పొలంలో ఏ పోషకాలు లోపించాయో తెలుసుకోవచ్చని, వాటి ఆధారంగా ఎరువులు వినియోగిస్తే సాగు ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. “ముందు భూసార పరీక్ష – తర్వాతే ఎరువుల వాడకం” అనే నినాదాన్ని ప్రతి రైతు పాటించాలని సూచించారు.
రాజేంద్రనగర్ ప్రాంతీయ భూసార పరీక్ష ప్రయోగశాల నుంచి వచ్చిన వ్యవసాయ అధికారులు వికాస్ పాటిల్, అనురాధ విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణ విధానాన్ని ప్రత్యక్షంగా వివరించారు. పొలంలో జిగ్‌జాగ్ పద్ధతిలో మట్టి నమూనాలను ఎలా సేకరించాలి, భూమిలోని పీహెచ్, విద్యుత్ వాహకత, సేంద్రియ కార్బన్ స్థాయిలను ఎలా గుర్తిస్తారో పరికరాల సహాయంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.మండల వ్యవసాయ అధికారి కె. నర్సింగా రావు మాట్లాడుతూ విద్యార్థులు రైతు కుటుంబాలకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించే రాయబారులుగా మారాలని అన్నారు. కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రులకు వివరించి, ప్రతి పొలానికి భూసార పరీక్ష చేయించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా “భూసార పరీక్షలు చేయించుకుందాం – సమతుల్య ఎరువులు వాడుదాం – నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. శ్రీనివాస్, సమన్వయకర్త ఎస్. కరుణాకర్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ప్రవళిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments