వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.
రైతులకు నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు.
పెద్దమందడి,సెప్టెంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వనపర్తి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం వీరాయిపల్లిలో వరి, వేరుశనగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఎన్. నవత, మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్ రైతుల పొలాలను సందర్శించి పంటల ఎదుగుదల, చీడపీడలు, వ్యాధులు, పోషక లోపాలను పరిశీలించారు.వరి పంటలో పొటాష్ లోపం, బ్యాక్టీరియా ఆకు ఎండుతెగులు, నల్లి, కాండం తొలిచే పురుగు ఉధృతిని గుర్తించారు. వేరుశనగలో రసాన్ని పీల్చే తామర పురుగుల ఉధృతి ఉన్నట్లు తెలిపారు. వీటి నివారణకు తగిన మందులు, పురుగు ఆకర్షణ ఉచ్చులు, పసుపు రంగు అంటుకునే ఉచ్చులను వినియోగించాలని రైతులకు సూచించారు.పంటలను నిరంతరం పరిశీలిస్తూ చీడపీడలు, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించాలని సూచించారు. సకాలంలో విత్తడం, విత్తన శుద్ధి చేయడం, వ్యవసాయ శాఖ సూచించిన మందులను మాత్రమే వినియోగించడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.


Comments