ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన చైర్మన్.
జమ్మికుంట, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమని, పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పిలుపునిచ్చారు.
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అత్యంత అవసరమన్నారు.
‘అమ్మ జన్మనిస్తే.. చెట్టు పునర్జన్మనిస్తుంది’ అనే భావనను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు తమ నివాస ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మొక్కలు పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలి లభించడంతో పాటు తమ ఆరోగ్యాన్ని, పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినవారవుతారని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరి బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే కాలుష్యాన్ని నియంత్రించగలమని అన్నారు. విద్యార్థులు మొక్కలు నాటడాన్ని ఒక కార్యక్రమంగా కాకుండా నిరంతర బాధ్యతగా స్వీకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమేష్, అధ్యాపకులు ఓదెలు కుమార్, గణేష్, రాజేందర్, రవీందర్‌తో పాటు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments