ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటాం.
99 జీవోను రద్దు చేయాలి – మాల సంఘాల డిమాండ్.
కరీంనగర్, సెప్టెంబర్ 28(తెలంగాణ ముచ్చట్లు ):
ఎస్సీ వర్గీకరణ అమలు, రోస్టర్ పాయింట్ల విధానం వల్ల మాల సామాజిక వర్గానికి ఉద్యోగాలు, విద్యా ప్రవేశాల్లో తీవ్ర నష్టం జరుగుతోందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాల సంఘాల నాయకులు ఆరోపించారు. 99 జీవోను వెంటనే రద్దు చేయాలని, ఎస్సీ వర్గీకరణలో మాలలకు కేటాయించిన రోస్టర్ పాయింట్లలో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రస్తుతం మాలలకు కేటాయించిన రోస్టర్ పాయింట్ 22 నుంచి 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లు ఇవ్వాలని, ఐదు శాతం రిజర్వేషన్‌ను ఏడు శాతానికి పెంచాలని నాయకులు కోరారు. లేనిపక్షంలో మాల, మాల ఉపకులాలను ఈడబ్ల్యూఎస్‌లో కలపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 59 ఎస్సీ కులాల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ స్థితిగతులపై సమగ్రంగా ఎంపిరికల్ డేటా సేకరించాలని నాయకులు కోరారు. ఆయా కులాల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రిజర్వేషన్ల అమలు విధానాన్ని రూపొందించాలని అన్నారు.
వన్‌మెన్ కమిషన్ నివేదిక ప్రకారం తెలంగాణలో ఎస్సీ ఉద్యోగులు సుమారు 96 వేల మంది ఉన్నారని, అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు 46 వేల మంది, మాల సామాజిక వర్గానికి చెందిన వారు 36 వేల మంది, మిగతా ఉపకులాలకు చెందిన వారు 10 వేల మంది ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ గణాంకాల ఆధారంగా మాల సామాజిక వర్గం ఉద్యోగాలను మొత్తం ఆక్రమించిందనే ఆరోపణలు సరైనవి కావని వారు అన్నారు.
2011–12 జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ చేపట్టడంపై కూడా నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఎస్సీ కులాల ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కొత్తగా సమగ్ర అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం విషయంలో ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాల సంఘాల నాయకులు హెచ్చరించారు. సెప్టెంబర్ 30, 2026న కరీంనగర్ కలెక్టరేట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే సందర్భంగా వేలాది మంది మాలలు నిరసన చేపట్టి ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జై తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లాల కనకరాజు, జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, జిల్లా అధ్యక్షుడు కాడే శంకర్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బోలుమల్ల సదానందం, రాష్ట్ర నాయకుడు దామెర సత్యం, గూడ కనకయ్య, జై తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మద్దెల రాజేందర్, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంటల రేణుక, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు తీట్ల ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.


Comments