రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .

రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .

--- జాతీయ ఉపాధ్యక్షులు జె.వి చలపతిరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం గౌరవ అధ్యక్షులు వి. కోటేశ్వరరావు
--- శ్రమకు తగ్గ గౌరవం ఇవ్వాలి 
--- ఖమ్మం వేదికగా ఏఐకెఎంఎస్ 4వ జాతీయ మహాసభలు
--- 28న భారీ ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ

ఖమ్మం బ్యూరో , సెప్టెంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు )

నేలను నమ్ముకుని పంట పండించే రైతు చేతుల్లోనే దేశ ఆహార భద్రత ఉందని, చెమట చిందించి సమాజ నిర్మాణానికి బాటలు వేసే కూలీ శ్రమలోనే దేశ అభివృద్ధి దాగి ఉందని చాటిచెప్పేలా అఖిల భారత రైతు–కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) 4వ అఖిల భారత మహాసభలకు ఖమ్మం నగరం వేదిక కానుందని జాతీయ ఉపాధ్యక్షులు జె.వి చలపతిరావు, అఖిల భారత రైతు కూలీ సంఘం గౌరవ అధ్యక్షులు వి. కోటేశ్వరరావు లు అన్నారు. 

ఖమ్మం నగరంలో టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో అఖిల భారత రైతు–కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) 4వ అఖిల భారత మహాసభలకు సర్వం సిద్దమైన సందర్బంగా ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. 

ఈ నెల సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న ఈ మహాసభలకు సర్వం సిద్ధమైంది. ‘వ్యవసాయాన్ని కాపాడండి – రైతాంగాన్ని రక్షించండి’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ మహాసభలు రైతు, వ్యవసాయ కార్మికుడు, కూలీ ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజంలో చైతన్యం తీసుకురావడంతో పాటు, శ్రమకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యతను నేటి తరానికి గుర్తుచేయనున్నాయి. ముఖ్యంగా యువత సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగేందుకు ఈ మహాసభలు ఒక సందేశ వేదికగా నిలవనున్నాయి. 28న భారీ ప్రజా ప్రదర్శన మహాసభల్లో భాగంగా సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి భారీ ప్రజా ప్రదర్శన ప్రారంభమై యస్ఆర్ అండ్ బిజియస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు ఏఐకెఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య అధ్యక్షత వహించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆశిష్ మిట్టల్, జాతీయ ఉపాధ్యక్షులు నిర్భయ్ సింగ్, జె.వి. చలపతిరావు, జాతీయ కార్యదర్శి బాలచందర్ షడంగీతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన నాయకులు ప్రసంగించనున్నారు.

వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదని, కోట్లాది ప్రజల జీవితాలకు అన్నం పెట్టే జీవనాధారమని మహాసభలు చాటి చెప్పనున్నాయి. రైతు పొలంలో పండించే ప్రతి గింజ వెనుక అతని శ్రమ, ఆశ, కుటుంబ భవిష్యత్తు దాగి ఉంటుంది. అదే విధంగా కూలీ చెమట చుక్కల్లో పట్టణాల నిర్మాణం, గ్రామాల అభివృద్ధి, సమాజ పురోగతి కనిపిస్తాయి. అందుకే రైతు, వ్యవసాయ కార్మికుడు, కూలీ సమస్యలను కేవలం ఒక వర్గానికి సంబంధించిన సమస్యలుగా కాకుండా సమాజం మొత్తం బాధ్యతగా చూడాల్సిన అవసరాన్ని ఈ మహాసభలు ముందుకు తీసుకురానున్నాయి. 29న జెండా ఆవిష్కరణ.. కీలక అంశాలపై చర్చ సెప్టెంబర్ 29న ఉదయం 9 గంటలకు జాతీయ అధ్యక్షుడి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అనంతరం ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ గోపినాథ్ ఆహ్వానం, ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి ప్రారంభోపన్యాసంతో మహాసభలు ప్రారంభమవుతాయి. సౌహార్ద ప్రతినిధుల సందేశాలు, జాతీయ కమిటీ పిలుపు, ఉద్యమ నిర్మాణంపై సమీక్ష, వివిధ తీర్మానాలు, భవిష్యత్ కర్తవ్యాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే నూతన జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఎన్నుకోనున్నారు. నేటి యువత సాంకేతికత, విద్య, ఉద్యోగాల వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో సమాజానికి అన్నం పెట్టే రైతు, సమాజ నిర్మాణంలో భాగస్వాములైన కూలీల జీవనాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన అభివృద్ధి వెనుక ఎవరి శ్రమ ఉందో గుర్తించడం, శ్రమించే మనిషిని గౌరవించడం, సమాజంలోని బలహీన వర్గాల పట్ల మానవీయతతో స్పందించడం ప్రతి యువకుడి సామాజిక బాధ్యతగా మారాల్సిన అవసరాన్ని ఈ మహాసభలు గుర్తుచేస్తున్నాయి. రైతు పొలంలో మొలిచే పంటలా, కూలీ చెమటతో ఎదిగే సమాజంలా, మనుషుల మధ్య పరస్పర గౌరవం, సహకారం, మానవత్వం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందనే సందేశాన్ని ఈ మహాసభలు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాయి. ప్రజా ప్రదర్శన, సభలకు మీడియా సహకారం కోరిన ఏఐకెఎంఎస్ సెప్టెంబర్ 28న నిర్వహించనున్న ప్రజా ప్రదర్శన, బహిరంగ సభలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కవర్ చేసి ప్రజలకు సమాచారం అందించాలని ఏఐకెఎంఎస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య, రాష్ట్ర అధ్యక్షులు యం. భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారు ఐలయ్య, మండల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి. ఉద్యమకారుల త్యాగాలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలి.
జమ్మికుంట, సెప్టెంబర్‌ 27 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమంలో జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని...
రైతు-కూలీ సంక్షేమమే సమాజ ప్రగతి .
వచ్చే మార్చి కల్లా నిర్మాణాలు పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలి… 
పర్యాటక వసతుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలకు కొత్త శోభ... 
‎ప్రజలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆప్యాయ పలకరింపులు.
అట్టహాసంగా అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు.
స్టేషన్ ఘనపూర్‌లో మొబైల్ షాపులో చోరీ.