అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక.
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
వనపర్తి,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):
అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి వీరనారి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వనపర్తి బస్టాండ్ సమీపంలోని ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూమి, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం నాటి అణచివేతకు ఎదురొడ్డి నిలిచిన చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం సమాజంలో చైతన్యాన్ని నింపిందని తెలిపారు.అన్యాయాన్ని ప్రశ్నించి, ఆత్మగౌరవం కోసం ధైర్యంగా నిలబడిన ఐలమ్మ జీవితం నేటి సమాజానికి గొప్ప సందేశాన్ని అందిస్తోందన్నారు. ముఖ్యంగా మహిళలు తమ హక్కుల కోసం ధైర్యంగా ముందుకు రావడానికి ఆమె పోరాటం స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు.మహిళా శక్తికి, బహుజన చైతన్యానికి, సామాజిక న్యాయ పోరాటానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని తూడి మేఘారెడ్డి కొనియాడారు. ఆమె ఆశయాలను, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం కృషి చేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయమని, ఆమె పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, ఉప చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కదిరె రాములు, వనపర్తి మండల అధ్యక్షుడు రవికిరణ్, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు, నాయకులు జీజే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Comments