టిబీ రహిత గ్రామాల కోసం సమష్టి కృషి చేయాలి.
జమ్మికుంట, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామాలను క్షయ వ్యాధి (టిబీ) రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు సూచించారు.
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో గురువారం జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల పల్లె దవాఖానాల వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలకు టిబీ వ్యాధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో టిబీపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. టిబీ సోకే అవకాశం అధికంగా ఉన్న వారిని గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి త్వరగా చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి గ్రామాన్ని టిబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వం అందించే గోల్డ్, సిల్వర్ అవార్డులు పొందేలా ఎక్కువ గ్రామాలు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో డాక్టర్ ప్రభుదాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఇంపాక్ట్ ఇండియా ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ ప్రభాకర్, మండల కోఆర్డినేటర్లు గీతాంజలి, తిరుపతి, జమ్మికుంటక్లస్టర్ టిబీ సూపర్‌వైజర్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments