కడియంకు రాజకీయ పునర్జన్మ ఇచ్చింది కేసీఆర్.
మున్సిపాలిటీ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్ నాయకుల విమర్శలు
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు వారు కౌంటర్ ఇచ్చారు.తాటికొండ రాజయ్య నిస్వార్థంగా రాజకీయాల్లో పనిచేశారని, ఆయన కుటుంబ సభ్యులు వైద్యులు అయినప్పటికీ సొంత ఆస్పత్రి ఏర్పాటు చేసుకోలేదని నాయకులు పేర్కొన్నారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాజయ్య ఉప ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారని తెలిపారు.కడియం శ్రీహరికి రాజకీయ పునర్జన్మ ఇచ్చింది కేసీఆర్ అని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ బీ-ఫారంపై ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరి, తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ఆమెను ఎంపీగా గెలిపించుకున్నారని విమర్శించారు.
గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంజూరు చేయించిన సాగునీటి పనులకు తిరిగి అంచనాలు రూపొందించి, తానే పనులు మంజూరు చేయించానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. 2004లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఒక్క జలాశయం కూడా ఉందా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలాశయాలకు పునాదులు వేస్తే, ఎమ్మెల్యేగా తాటికొండ రాజయ్య ఏడు జలాశయాలను ప్రారంభించారని తెలిపారు.2004 నుంచి 2023 వరకు ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరిని మర్చిపోయారనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధిపై విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదన్నారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన జీవో 97ను రద్దు చేయించాలని కడియం శ్రీహరికి సవాల్ విసిరారు.స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీకి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించానని చెప్పడం కాకుండా ప్రతి వార్డులో వార్డు సభ్యులతో కలిసి పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. మున్సిపాలిటీలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మరోసారి రెండో శ్రేణి నాయకులతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తమ నాయకుడు తాటికొండ రాజయ్యపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాజయ్య జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త అని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో స్టేషన్ ఘన్‌పూర్, జాఫర్‌గఢ్, లింగాల ఘన్‌పూర్ మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్, పల్లెపాటి జయపాల్‌రెడ్డి, చౌదరపల్లి శేఖర్, కౌన్సిలర్లు తాటికొండ మధు, బాలగాని అనిల్, పొన్న రాజేష్, చల్ల రమ్య–రఘురెడ్డి, మున్సిపల్ కన్వీనర్ కనకం గణేష్, మాజీ వైస్ చైర్మన్ చందర్‌రెడ్డి, నాయకులు శీలం శ్యామ్, మారేపల్లి ప్రసాద్, గుండె మల్లేష్, కుంభం కుమారస్వామి, చింత శ్రీను, ఆకారపు అశోక్, చిట్టిబాబు, హీరాసింగ్, సామాజిక మాధ్యమాల బాధ్యుడు గట్టు కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు.


Comments