నిమజ్జనాలకు నీళ్లివ్వడానికి ఇంత జాప్యమా?
*గణేష్ నిమజ్జనానికి నీటి కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి దురదృష్టకరం*
*ప్రభుత్వం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలి*
*చింతకుంట కెనాల్‌కు నీరు విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్‌రావు*
కరీంనగర్, సెప్టెంబర్ 22(తెలంగాణ ముచ్చట్లు ):
గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సింది పోయి, నిమజ్జనాలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు సృష్టించడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎస్‌బీఎస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో గణేష్ నిమజ్జనాల కోసం చింతకుంట కెనాల్‌కు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని మేయర్, డిప్యూటీ మేయర్ హోదాలో అధికారులకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని సునీల్‌రావు ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సారెస్పీలో నీరు అందుబాటులో ఉన్నప్పుడు గణేష్ నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా చింతకుంట కెనాల్‌కు నీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ సైతం జిల్లా అధికారులతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నీటి విడుదలపై విజ్ఞప్తి చేశారని చెప్పారు. భారీ సంఖ్యలో గణేష్ విగ్రహాలు చింతకుంట కెనాల్‌లో నిమజ్జనం కానున్నప్పటికీ ప్రభుత్వం తొలుత స్పందించలేదని విమర్శించారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్, బారికేడింగ్, క్రేన్లు తదితర ఏర్పాట్లు చేసిన తర్వాత నీరు లేకుంటే నిమజ్జనాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మండపాల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకే బీజేపీ చింతకుంట కెనాల్ వద్ద ఆందోళన చేపట్టిందని స్పష్టం చేశారు. బండి సంజయ్‌కుమార్ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించామని తెలిపారు.
ఆందోళన అనంతరం ప్రభుత్వం చింతకుంట కెనాల్‌కు నీటిని విడుదల చేసిందని సునీల్‌రావు పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనాల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ఎస్సారెస్పీలో పెద్ద మొత్తంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ నిమజ్జనాల కోసం అవసరమైన నీటిని విడుదల చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు తమ చందాలతో పండగలు నిర్వహించుకుంటున్నారని, ప్రభుత్వం ప్రజలు నిర్వహించే అన్ని పండగలకు సమానంగా సహకరించాలని సూచించారు. ఏ మతం, ఏ వర్గానికి చెందిన పండగైనా గౌరవించి, అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని విడనాడి ప్రజల పండగలకు సహకరించాలని హితవు పలికారు.
ఈ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు పొన్నం లక్ష్మి-మొండయ్య, రామన్, తోట అనిల్, ఒంటెల సత్యనారాయణరెడ్డి, దేశశిల్ప-వేదం, సోమిడి వేణు, మాసం గణేష్, కో-ఆప్షన్ సభ్యులు బల్వీర్‌సింగ్, మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి, నాయకులు పండుగ నాగరాజు, భాస్కర్, కటకం లోకేష్, అక్షయ్, రాజ ప్రభాకర్, కుంభం అనిల్, అరకిల శంకర్, సురేందర్, భాస్కర్, రాజశేఖర్ సత్యనారాయణరెడ్డి, యువమోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments