స్వచ్ఛ కరీంనగర్ మా లక్ష్యం.. సమగ్రాభివృద్ధే మా ధ్యేయం.
*డంపింగ్ యార్డు సమస్యకు రూ.17 కోట్లతో శాశ్వత పరిష్కారం*
*వారంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం: బండి సంజయ్ కుమార్*
కరీంనగర్, సెప్టెంబర్ 20(తెలంగాణ ముచ్చట్లు ):
స్వచ్ఛ కరీంనగర్ నిర్మాణంతో పాటు నగర సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం పారిశుధ్య కార్మికులకు నూతన ట్రైసైకిళ్ల పంపిణీ, ఫాగింగ్ యంత్రాల ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, పాలకవర్గ సభ్యులతో కలిసి బండి సంజయ్ కుమార్ 66 పారిశుధ్య ట్రైసైకిళ్లను, రెండు ఫాగింగ్ యంత్రాలను ప్రారంభించారు. డివిజన్‌కు ఒకటి చొప్పున ట్రైసైకిళ్లను పారిశుధ్య కార్మికులకు అందజేశారు.
నగర పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ట్రైసైకిళ్లు, ఫాగింగ్ యంత్రాలతో పాటు ట్రాక్టర్లు, కొత్త జేసీబీలు, వైకుంఠ రథాలను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
అంతర్గత రహదారుల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులతో పనులు చేపడుతున్నామని, నగర ప్రజలను చాలాకాలంగా వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు రూ.17 కోట్ల వ్యయంతో శాశ్వత పరిష్కారం చూపేందుకు
చర్యలు చేపట్టామని తెలిపారు. వారంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.


Comments