ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.
చిల్పూర్, సెప్టెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ప్రముఖ పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం చిల్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఉప సర్పంచ్ రాజారపు రంజిత్ అధ్యక్షతన నిర్వహించిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది.శిబిరంలో వృద్ధులు, మహిళలతో పాటు 100 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కంటి శస్త్రచికిత్స అవసరమైన అర్హులకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు అందజేస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గతంలో కూడా చిల్పూర్ గ్రామంలో 180 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రాజారపు రంజిత్ మాట్లాడుతూ పేద ప్రజలకు కంటి చూపును మెరుగుపరిచేందుకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న పుష్పగిరి కంటి ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప వార్డు సభ్యుడు మహ్మద్ షకీల్, దేవస్థానం డైరెక్టర్ గణగోని రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Comments