ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్ నేతల వినతి.
- రైతాంగ సమస్యలు పరిష్కరించాలి.
- ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో నిబంధనలు పాటించాలి.
- 11 వేల ఎకరాలకు సాగునీరు.. ఎత్తిపోతల పథకాలకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్.
సత్తుపల్లి, సెప్టెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
జిల్లాలో నెలకొన్న ప్రజా, రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి కాలువల ఆధునికీకరణ, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సదుపాయం, మైనారిటీలకు అవసరమైన స్థలం తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందిరమ్మ ఇళ్ల ఎల్1, ఎల్2 కేటగిరీల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు. అధికార పార్టీ క్యాంపు కార్యాలయాల్లో రూపొందించిన అనధికారిక జాబితాలను విచారణలకు పంపుతున్నారని ఆరోపించారు. దీనివల్ల స్థానిక సర్పంచుల హక్కులు, స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తి దెబ్బతింటోందన్నారు. అనధికారిక జాబితాలను రద్దు చేసి.. సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేయాలని కోరారు.
తల్లాడ మండలం సిరిపురం మేజర్ కాలువ ఆధునికీకరణ పనులు పెండింగ్‌లో ఉండటంతో సుమారు 11 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. సీతారామ సాగర్ జలాలు సమీపంలో ప్రవహిస్తున్నా.. కాలువ పనులు పూర్తికాక నీటిని ఆయకట్టుకు మళ్లించలేకపోతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.
పెనుబల్లి మండలంలోని రాతోని, తాళ్లపెంట ఎత్తిపోతల పథకాల పరిధిలో చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్లను ఏడాది గడిచినా పునరుద్ధరించలేదని నాయకులు తెలిపారు. రాతోని పథకం కింద 2,300 ఎకరాలు, ఐదు గ్రామాలు, తాళ్లపెంట పథకం కింద 1,600 ఎకరాలు, రెండు గ్రామాలు ఉన్నాయని వివరించారు. మొత్తంగా సుమారు 3,900 ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉందన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినందున తక్షణమే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి పంటలను కాపాడాలని కోరారు.
రఘునాథపాలెం మండలం జింకలతండాలో ఈద్గా, ఖబరస్థాన్‌కు సరైన స్థలం లేక గ్రామస్థులు 55 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేటాయించిన ప్రభుత్వ భూమికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. జిల్లాలోని ఇతర ప్రజా సమస్యలను సైతం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు.


Comments