ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా కల్పించాలి.

ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా కల్పించాలి.

- ఎఫ్‌ఎఫ్‌బీకి టన్నుకు రూ.25 వేల హామీ ధర కోరిన రైతుల సంఘం .
- కేంద్ర మంత్రికి వినతి.

అశ్వారావుపేట, సెప్టెంబరు 18 (తెలంగాణ ముచ్చట్లు):

ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, పంటపై భరోసా పెంచాలని తెలంగాణ ఆయిల్‌పామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ఆయిల్‌పామ్ తాజా పండ్ల గెలలు (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధరను అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు అలపాటి రామచంద్ర ప్రసాద్ శుక్రవారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం ప్రతిని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సైతం అందజేశారు. దేశాన్ని తినదగిన నూనెల ఉత్పత్తిలో ఆత్మనిర్భర్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్‌పామ్ (ఎన్‌ఎంఈఓ–ఓపీ)’ను అమలు చేస్తోందని రామచంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడం, ముడి పామాయిల్ ఉత్పత్తిని పెంచడం, వంట నూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం పథకం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థ టీజీ ఆయిల్‌ఫెడ్ అధిక నూనె దిగుబడిని సాధిస్తూ ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహకంగా నిలుస్తోందన్నారు. టీజీ ఆయిల్‌ఫెడ్ సాధిస్తున్న నూనె వెలికితీత రేటును ప్రామాణికంగా తీసుకుని రైతులకు ఎఫ్‌ఎఫ్‌బీ ధరలు నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్‌ఎంఈఓ–ఓపీ కింద ఐదేళ్లలో పెద్దఎత్తున ఆయిల్‌పామ్ తోటల విస్తరణకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పంటపై రైతుల్లో ఆసక్తి పెరుగుతున్నా.. ఎఫ్‌ఎఫ్‌బీ ధరల్లో హెచ్చుతగ్గులు సాగు వ్యయానికి చేరువవుతుండటంతో కొత్తగా తోటలు సాగు చేసేందుకు రైతులు వెనుకాడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఎరువులు, కూలీలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరగడంతో ఆయిల్‌పామ్ సాగు వ్యయం అధికమైందన్నారు. ఎఫ్‌ఎఫ్‌బీ ధరలు తగ్గిన సందర్భాల్లో ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు సైతం నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు చెల్లించే ఎఫ్‌ఎఫ్‌బీ ధర నెలవారీ సగటు ముడి పామాయిల్ ధర ఆధారంగా నిర్ణయిస్తారని పేర్కొన్నారు. రైతులకు పంట లాభదాయకంగా ఉండాలంటే ముడి పామాయిల్ ధర టన్నుకు సుమారు రూ.1.40 లక్షల స్థాయిలో ఉండేలా చర్యలు అవసరమన్నారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను సాధించడంతోపాటు రైతుల్లో పంటపై నమ్మకాన్ని పెంచేందుకు ఎఫ్‌ఎఫ్‌బీకి టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధరను అమలు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!