రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే
కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తిన్నింటి వాసాలు లెక్కెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డల భవిష్యత్తు కోసం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.
కడియం శ్రీహరి నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనూ అభివృద్ధి పనులు చేపట్టడం లేదని రాజయ్య విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాలు, గూడేలు, ఆవాసాలను గ్రామపంచాయతీలుగా గుర్తించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని అన్నారు. గ్రామాలకు కడియం శ్రీహరి వస్తే ప్రజలు నిలదీయాలని, తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రేవంత్ రెడ్డి రాక్షసుడు” అని వ్యాఖ్యానిస్తూ, ప్రజలకు సరైన పరిపాలన అందించడం లేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఇంటింటికీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రైతుబంధు పథకం ఆగలేదని గుర్తు చేశారు.
ప్రస్తుతం రైతుబంధు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పెన్షన్లు సక్రమంగా అందడం లేదని రాజయ్య ఆరోపించారు. విద్యార్థులకు మోటార్‌సైకిళ్లు ఇస్తామని హామీ ఇచ్చి, మోటార్‌సైకిల్ కాదు కదా, దానికి సంబంధించిన టైర్లు కూడా ఇవ్వలేదంటూ ఎద్దేవా చేశారు.
రఘునాథపల్లి మండలం యాపలగడ్డ తండాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు. తండాలు, గూడేలు, ఆవాసాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతగా నిర్వహించిన పాలాభిషేక కార్యక్రమంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తండాలు, గూడేలు, ఆవాసాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా గిరిజనులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. “మా తండాలో మా పాలన.. మా గూడేలో మా పాలన” అనే లక్ష్యంతో గ్రామపంచాయతీల ఏర్పాటు జరిగిందని తెలిపారు.
కార్యక్రమంలో
ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొర్ర రాజేందర్ నాయక్, రఘునాథపల్లి మాజీ ఎంపీపీ ఎర్రోళ్ల కుమార్ గౌడ్, మండల ఇన్‌చార్జి ముసిపట్ల విజయ్, గూడ కిరణ్, దుబ్బాక హరీష్ గౌడ్, యాక స్వామి, పాల్నాటి రాజిరెడ్డి, హరి నాయక్, బండి కుమారస్వామి, మట్లపల్లి సునీత రాధాకృష్ణ, సునీతతో పాటు ఎస్టీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, తండాల ముఖ్య నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments