తెలంగాణ ముచ్చట్లు వార్తకు స్పందన.. కదిలిన అధికార యంత్రాంగం!.
కృష్ణాజిగూడెం వార్డుల్లో మురుగునీటి సమస్యపై ఎంపీడీఓ సీరియస్
ఫాగింగ్, బ్లీచింగ్‌కు ఆదేశాలు.. డ్రైనేజీలకు అడ్డుకట్ట వేసేవారికి నోటీసులు
చిల్పూర్, సెప్టెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని కృష్ణాజిగూడెం గ్రామంలోని 3, 4వ వార్డుల్లో మురుగునీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ తెలంగాణ ముచ్చట్లులో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది.వార్తపై స్పందించిన చిల్పూర్ ఇన్‌చార్జి ఎంపీడీఓ కిరణ్ ప్రసాద్, సర్పంచ్ మల్లం రవీందర్‌తో కలిసి శుక్రవారం కృష్ణాజిగూడెం గ్రామంలోని ఆయా కాలనీల్లో పర్యటించారు. మురుగునీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. సమస్యలపై పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కాలనీల్లో వెంటనే పొగమందు పిచికారీ చేయించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ కాలువల్లో బ్లీచింగ్ పొడి చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. నిలిచిపోయిన మురుగునీటిని తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.అలాగే డ్రైనేజీ కాలువలకు అడ్డుకట్టలు వేసిన వారిని, ఇళ్ల నిర్మాణ వ్యర్థాలతో కాలువలను పూడ్చిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. కాలనీలో అవసరమైన విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీడీఓ తెలిపారు.అధికార యంత్రాంగం స్పందించి కాలనీలో పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన తెలంగాణ ముచ్చట్లు పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ పర్యటనలో పంచాయతీ కార్యదర్శి జేస్మని, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Comments