ప్రతిభకు దక్కిన గౌరవం.!
- శ్రీశ్రీ కళావేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా పోతర్లంక జయరామ్.
- అక్షర కిరీటి అవార్డుకు ఎంపిక.
సత్తుపల్లి, సెప్టెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
సాహితీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ కవిగా, రచయితగా కొనసాగుతున్న సత్తుపల్లి పట్టణానికి చెందిన పోతర్లంక జయరామ్‌కు అరుదైన గౌరవం లభించింది. శ్రీశ్రీ కళావేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. సాహిత్య రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన శ్రీశ్రీ కళావేదిక ఈ బాధ్యతలను అప్పగించింది. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, అధికార ప్రతినిధి వరలక్ష్మి సాయిరాం ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడంతో పాటు జయరామ్‌ను ‘అక్షర కిరీటి’ అవార్డుకు ఎంపిక చేశారు.
భద్రాచలం ఎట్టపాకలోని పౌల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 20న నిర్వహించనున్న 176వ శతాధిక కవి సమ్మేళనం సందర్భంగా అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనుంది. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్ చేతుల మీదుగా జయరామ్ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ.. 176వ శతాధిక కవి సమ్మేళనం సందర్భంగా తనను అక్షర కిరీటి అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. కవులు, కళాకారులను ప్రోత్సహించడంలో శ్రీశ్రీ కళావేదిక ముందుంటుందని, దేశ, విదేశాల్లో వివిధ సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. తన సాహితీ ప్రయాణాన్ని గుర్తించి ఈ గౌరవం అందించిన వేదికకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. జిల్లా కార్యదర్శిగా నియమితులవడంతో పాటు అక్షర కిరీటి అవార్డుకు ఎంపికైన పోతర్లంక జయరామ్‌కు సత్తుపల్లి డివిజన్‌కు చెందిన కవులు, రచయితలు, సాహితీవేత్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.


Comments