రైతు సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం.!
- రైతు భరోసా, రుణమాఫీతో అన్నదాతకు అండ.
- ఆయిల్‌పామ్‌కు కనీస ధర కల్పించాలి.
- కేంద్రం సహకారం అవసరం..ఎల్‌నినో పరిస్థితులపై ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి.
- మంత్రి తుమ్మల.
సత్తుపల్లి, సెప్టెంబరు 18 (తెలంగాణ ముచ్చట్లు):
రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు పంటకు గిట్టుబాటు ధర, సాగుకు సాంకేతిక సహకారం, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్ హైటెక్‌సిటీలోని ట్రైడెంట్ హోటల్‌లో నిర్వహించిన సదరన్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.12 వేల చొప్పున అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.35,839 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి తెలిపారు. వానాకాలం-2026లో కేవలం తొమ్మిది రోజుల్లో 70.40 లక్షల మంది పట్టాదారులకు రూ.8,759 కోట్లను నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. రైతు రుణమాఫీ కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి, దాదాపు 25 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కల్పించామని, ఇందుకోసం సుమారు రూ.21 వేల కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. రైతు బీమా ద్వారా గత మూడేళ్లలో రూ.3,531 కోట్ల ప్రీమియం చెల్లించి 42 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు భద్రత కల్పించినట్లు తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికత వినియోగాన్ని పెంచుతున్నామని, ‘రైతు నేస్తం’ ద్వారా నిపుణుల సలహాలు అందిస్తున్నామని చెప్పారు. యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీని పారదర్శకంగా, సమర్థంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని తుమ్మల తెలిపారు. దాదాపు లక్ష హెక్టార్లను అదనంగా ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకురాగా, 72 వేల మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యారని చెప్పారు. అయితే ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుకు ధర భరోసా ఉండటం అత్యంత ముఖ్యమన్నారు. క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని పునఃపరిశీలించాలని, తాజా ఆయిల్‌పామ్ గెలలకు (ఎఫ్‌ఎఫ్‌బీ) టన్నుకు రూ.25 వేల కనీస గ్యారంటీ ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే మార్కెట్ ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కొనుగోళ్లు చేపడుతోందని మంత్రి చెప్పారు. మొక్కజొన్నకు సుమారు రూ.6 వేల కోట్లు, జొన్నకు రూ.1,100 కోట్లకు పైగా విలువైన కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎంఎస్‌పీ అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌ఎస్ కింద నాఫెడ్ వంటి కేంద్ర సంస్థల ద్వారా సమర్థంగా కొనుగోలు చేయాలని సూచించారు. మార్కెట్ ధరలు ఎంఎస్‌పీ కంటే దిగువకు వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్న 25 శాతం పీఎస్‌ఎస్ పరిమితిని సడలించాలని లేదా తొలగించాలని కోరారు. రాష్ట్రాలు అదనంగా చేపట్టే కొనుగోళ్ల వ్యయంలో కేంద్రం కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించాలని తుమ్మల కోరారు. ఎల్‌నినో ప్రభావం, అనిశ్చిత వర్షాలు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఎల్‌నినో అసిస్టెన్స్ ఫండ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ సాగునీటి పద్ధతులు, నీటి పొదుపు చర్యలకు కేంద్రం మరింత ఆర్థిక సహకారం అందించాలని కోరారు. రైతుకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు పంటకు గిట్టుబాటు ధర లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసినప్పుడే వ్యవసాయ రంగం మరింత బలోపేతమవుతుందని మంత్రి పేర్కొన్నారు.


Comments