గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. హన్మకొండ వైపు పరారీ.
హుజురాబాద్, సెప్టెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణ శివారులోని పరకాల క్రాస్ రోడ్ వద్ద ఓ గృహిణి మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు చోరీ చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.
పరకాల క్రాస్ రోడ్ వద్ద హోటల్ నిర్వహిస్తున్న గోస్కుల సక్కమ్మ వద్దకు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చారు. హెల్మెట్లు ధరించిన వారు హోటల్ వద్దకు చేరుకుని, ఒక్కసారిగా సక్కమ్మ మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కొని బైక్‌పై హన్మకొండ వైపు వేగంగా వెళ్లిపోయారు.
అకస్మాత్తుగా జరిగిన ఘటనతో సక్కమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరించి, నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
పట్టపగలే హోటల్ వద్ద ఈ విధంగా చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.


Comments