నిరుపేద MBBS విద్యార్థినికి అండగా డా. కవ్వంపల్లి.
*రూ.1.29 లక్షల చెక్కు అందజేత*
*పుస్తకాల బాధ్యత కూడా నాదేనని హామీ*
కరీంనగర్, సెప్టెంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు ):
ఆర్థిక ఇబ్బందులతో వైద్య విద్యను కొనసాగిస్తున్న నిరుపేద విద్యార్థిని వడ్డేపల్లి రహేల్‌కు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అండగా నిలిచింది. వరంగల్ జిల్లా చెన్నారెడ్డిపల్లి లేబర్ కాలనీకి చెందిన రహేల్ ప్రస్తుతం ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తోంది.
కుటుంబ సభ్యుల విజ్ఞప్తికి స్పందించిన మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ రూ.1,29,500 విలువైన చెక్కును విద్యార్థినికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదన్నారు. రహేల్ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎంబీబీఎస్ పూర్తి చేసి మంచి వైద్యురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆమె చదువుకు తన వంతు సహాయం కొనసాగిస్తానని, పూర్తి విద్యకు అవసరమైన పుస్తకాల బాధ్యతను కూడా తానే స్వీకరిస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థిని భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయంతో పాటు పుస్తకాల బాధ్యతను స్వీకరించిన డా. కవ్వంపల్లి సత్యనారాయణకు రహేల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Comments