జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం.
28న అశ్వారావుపేటలో టీజేఎంయూ ప్రథమ మహాసభ.. కరపత్రాలు ఆవిష్కరణ.
అశ్వారావుపేట, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం కలమెత్తి పోరాడే జర్నలిస్టులు.. నేడు తమ హక్కులు, వృత్తి భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఉదయరాఘవేంద్ర అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 28న ఉదయం 11 గంటలకు అశ్వారావుపేటలోని కెమిలాయిడ్స్ గెస్ట్‌హౌస్‌లో టీజేఎంయూ నియోజకవర్గ ప్రథమ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభకు యూనియన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షుడు ఇనపనూరి ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ రూపొందించిన ప్రచార కరపత్రాలను శనివారం యూనియన్ నాయకులు, సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. సమాజ రక్షణలో ముందుండే జర్నలిస్టులకు వృత్తి భద్రత, ఆరోగ్య రక్షణ కొరవడుతున్నాయని ఉదయరాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇళ్లు లేక పలువురు పాత్రికేయులు అద్దె ఇళ్లలోనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వార్తా సేకరణలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న విలేకరులపై బెదిరింపులు, అక్రమ కేసులు నమోదవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, రక్షణ కోసం సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ, వ్యక్తిగత భేదాలను పక్కనపెట్టి వర్కింగ్ జర్నలిస్టులంతా హక్కుల సాధన కోసం ఏకతాటిపైకి రావాలని ఉదయరాఘవేంద్ర పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను వారి గొంతుకతోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 28న నిర్వహించే మహాసభ ఇందుకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులంతా మహాసభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నూనె హనుమంతరావు, పెనుగొండ సత్యనారాయణ, నార్లపాటి సుబ్బారావు, బి.రాము, మద్దు రవికుమార్, దాది చంటి, ముల్లగిరి రమేష్, ముళ్లగిరి విజయ్, రాయల పోలయ్య, సలార్, గణేష్‌తో పాటు కార్యవర్గ సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.


Comments