పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి.
మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్.
స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్‌పూర్ పురపాలక అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్యంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా డబ్బాల్లో సేకరించాలని కోరారు. చెత్త సేకరణ వాహనాలు, ట్రాలీలు వచ్చినప్పుడు వాటిలోనే చెత్త వేయాలని సూచించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో 43 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, సిబ్బంది కొరత కారణంగా కొంతమేర ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. మరో 30 మంది సిబ్బంది అవసరం ఉందన్నారు.
సిబ్బంది కొరతతో ఇబ్బందులు
మున్సిపాలిటీలో సిబ్బంది కొరత దృష్ట్యా ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగాన్ని తగ్గించాలని తాటికొండ వినయ్ కుమార్ కోరారు. పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు 4 స్వచ్ఛ ఆటోలు, 2 ట్రాక్టర్లు, ఒక జేసీబీ కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 3 ట్రాక్టర్లు, 2 ఆటోలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ప్రస్తుత పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకుని మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయంలో త్వరలో పౌర సేవల వివరాల పట్టికను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కొంతమంది చెత్త సేకరణ వాహనం రాకపోతే మురుగు కాలువల్లో చెత్త వేస్తున్నారని, దీనివల్ల పారిశుద్ధ్య సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రజలు చెత్తను డబ్బాల్లో సేకరించి, చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడు అందులోనే వేయాలని సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.


Comments