చిల్పూర్ గుట్టపై వైభవంగా బుగులు వెంకన్న కల్యాణం.
చిల్పూర్, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానం చిల్పూర్ గుట్టలో శనివారం స్వామివారి వార కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.ఉదయం నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత బుగులు వేంకటేశ్వర స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించి తరించారు.
కల్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని తిలకిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బి. లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి శ్రీరంగాచార్యులు, ఆదిత్యాచార్యుల కృష్ణమాచార్యులు స్వామివారి కల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


Comments