ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయించాలి.
*బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలి*
*16 ఏళ్లలోపు పిల్లలకు సెల్‌ఫోన్ వినియోగంపై చట్టం చేయాలి: వలస సుభాష్ చంద్రబోస్*
హుజురాబాద్, సెప్టెంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ కోరారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వ శాఖలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
హుజురాబాద్ పట్టణ కేంద్రంలో శనివారం విలేకరులకు ప్రకటన విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల కార్మికులు లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. బాల్యం ఎంతో విలువైనదని, పిల్లలకు నాణ్యమైన విద్య అందించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
16 ఏళ్లలోపు పిల్లలకు సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నియంత్రించే విధంగా రాష్ట్ర శాసనసభలో చట్టం చేయాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డిని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నట్లు తెలిపారు. బాలల హక్కులను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బాలలతో ఎవరైనా పనులు చేయిస్తే వెంటనే 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు విద్యా హక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాల కార్మికులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చేర్పించేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని కోరారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రతి పౌరుడు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బాల్య వివాహాల నిర్మూలనకు కూడా సమాజంలోని అన్ని వర్గాలు కంకణబద్ధులు కావాలని అన్నారు. బాలల హక్కుల ప్రజా వేదిక గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రవ్యాప్తంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ కోసం కృషి చేస్తోందని తెలిపారు.
సెప్టెంబర్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సెల్‌ఫోన్, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నియంత్రించే చట్టం తీసుకురావాలని కోరుతూ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు, దోమతెరలు అందించడంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


Comments