జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దు.
మంత్రులు, ఎమ్మెల్యేల బృందం.
వనపర్తి,సెప్టెంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
జూరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ప్రస్తుత పంటలకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.జూరాల ఆయకట్టు రైతుల సాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని మార్గాల్లో చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పరిధిలో సాగు చేస్తున్న పంటలను కాపాడేందుకు రోజుకు 5,000 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు కృష్ణా జలాలను నియంత్రితంగా విడుదల చేయాలని లేఖలో కోరినట్లు తెలిపారు.ఈ నాలుగు సాగునీటి పథకాల పరిధిలో సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని, ప్రస్తుతం పంటలకు కీలక దశ కావడంతో సకాలంలో సాగునీరు అందించడం అత్యంత అవసరమని మంత్రి తన లేఖలో పేర్కొన్నట్లు మేఘారెడ్డి తెలిపారు.
కర్ణాటకకు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం
సాగునీటి విడుదలపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసి తెలంగాణ రైతుల సాగునీటి అవసరాలను వివరించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటకకు బయలుదేరనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బృందం హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం బయలుదేరి కర్ణాటక ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు వెల్లడించారు.కర్ణాటక ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో జూరాల సహా తెలంగాణలోని ఆయకట్టు ప్రాంతాల సాగునీటి అవసరాలను వివరించి, రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని కోరనున్నట్లు మేఘారెడ్డి తెలిపారు.రైతులు ఎలాంటి అధైర్యానికి గురికావద్దు. పంటలు చేతికొచ్చే వరకు ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో సాగునీటిని సమకూర్చేందుకు కృషి చేస్తోంది. జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు.


Comments