ఇద్దరి మధ్య తగాదాను బహిష్కరణగా చిత్రీకరణ..?
నిజానిజాలు తేల్చేందుకు గ్రామంలోకి అధికారులు.
చిల్పూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సాధారణ వ్యక్తిగత తగాదా సామాజిక బహిష్కరణ అంశంగా మారడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత గొడవను సామాజిక బహిష్కరణగా పేర్కొంటూ ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఫిర్యాదును జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకోవడంతో చిల్పూర్ పోలీసులు, తహసీల్దార్ కార్యాలయ రెవెన్యూ అధికారులు మంగళవారం శ్రీపతిపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాలతో పాటు గ్రామ పెద్దలు, సర్పంచ్‌ను విడివిడిగా విచారించారు.
గొడవకు అసలు కారణం ఏమిటి, సామాజిక బహిష్కరణకు సంబంధించిన అంశం వాస్తవమేనా? అనే విషయాలపై అధికారులు సమగ్రంగా వివరాలు సేకరించారు. గ్రామంలో పరిస్థితులను పరిశీలించి సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు.విచారణలో సేకరించిన వివరాలు, వెల్లడైన వాస్తవాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


Comments