ప్రజల కోసం పనిచేసే వారిని పార్టీ ప్రోత్సహిస్తుంది.
గ్రామస్థాయి నుంచే పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
మండల, గ్రామ అనుబంధ కమిటీల పరిచయ వేదికలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామస్థాయి నాయకత్వ నిర్మాణం పటిష్టంగా ఉన్నప్పుడే ఏ రాజకీయ పార్టీ అయినా బలంగా ఉంటుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసే వారికి పార్టీ ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు.
స్టేషన్ ఘనపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల, గ్రామ అనుబంధ కమిటీల పరిచయ వేదిక, మండల విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ కార్యవర్గ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులకు కండువాలు కప్పి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ పార్టీ కల్పించిన అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి నాయకులందరినీ కలుపుకొని గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీలో కొనసాగుతూ సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పార్టీ నిబంధనలు, క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని సూచించారు.
పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ సమిష్టిగా పనిచేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో రెండోసారి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నాయని కడియం శ్రీహరి ఆరోపించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారాన్ని, ధరణి వ్యవస్థను అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసిందని ఆయన ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయల ఆస్తులను ఉద్యమకారులకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు.అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షల 28 వేల 500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బెలిదే వెంకన్న, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లాస్థాయి నాయకులు, మండలస్థాయి నాయకులు ఇంద్రసేనారెడ్డి, మందపురం అనిల్, నూతన గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments