గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు.
భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యం.. అధికారులతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సమీక్ష.
మానకొండూర్, సెప్టెంబర్ 21(తెలంగాణ ముచ్చట్లు ):
గణేష్ విగ్రహాల నిమజ్జనం సజావుగా, ప్రశాంతంగా, భద్రం
గా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మానకొండూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో నిమజ్జన ఏర్పాట్లపై మండల, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నిమజ్జన స్థలంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, తాత్కాలిక లైటింగ్, తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక వాహనాల సిద్ధత తదితర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమగ్రంగా చర్చించారు. పెద్ద విగ్రహాలను క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలని, చిన్న విగ్రహాలకు ప్రత్యేక ప్రాంతాలను కేటాయించాలని సూచించారు. ప్లాస్టిక్, రసాయన రంగుల వినియోగాన్ని నియంత్రించి చెరువు పర్యావరణాన్ని పరిరక్షించాలని అధికారులకు సూచించారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వయంగా చెరువు కట్ట వద్దకు వెళ్లి నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి మట్టం, చెరువు కట్ట బలం, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల రాకపోకలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. అవసరమైన చోట్ల లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసి సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు క్రమశిక్షణతో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అధికారులు, ప్రజలు, ఉత్సవ కమిటీలు సమన్వయంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. నిమజ్జనం అనంతరం చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని కూడా సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments