బీఎస్ఎఫ్ రెండు దశాబ్దాల ఉత్సవాలను విజయవంతం చేయండి.
బీఎస్ఎఫ్ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి పిలుపు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రెండు దశాబ్దాల ఉత్సవాలను సెప్టెంబర్ 28న ఘనంగా నిర్వహించనున్నట్లు, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఎస్ఎఫ్ వ్యవస్థాపకులు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రెండు దశాబ్దాల ఉత్సవాల కరపత్రాన్ని సోమవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ ఎన్నో చారిత్రక సంఘటనలు, సామాజిక ఉద్యమాలకు నిలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో 2006 సెప్టెంబర్ 28న బహుజన స్టూడెంట్ ఫెడరేషన్‌ను స్థాపించినట్లు తెలిపారు. నేటితో సంస్థ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు దశాబ్దాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కమిటీకి సూచించారు.
బీఎస్ఎఫ్ కార్యక్రమాలతో తనకు ఎంతో అనుబంధం ఉందని, సంస్థ స్థాపించిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు అగ్రవర్ణాల్లోని పేద విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అండగా నిలిచామని తెలిపారు. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 28న ఉదయం 10 గంటలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్ఎఫ్ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి హాజరవుతారని తెలిపారు. విశిష్ట అతిథులుగా బీసీ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు మణికంఠ, గిరిజన జేఏసీ చైర్మన్ రాజేష్ నాయక్ పాల్గొంటారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు కందుల శ్రీను, డాక్టర్ గుంటి ప్రభాకర్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రహీం, ఓయూ జేఏసీ నాయకులు డాక్టర్ అందే కృష్ణ, గడ్డం శ్రీరామ్, జోగు గణేష్, బీఎస్ఎఫ్ ఓయూ ఉపాధ్యక్షుడు ఆరెకంటి శ్రీకాంత్, శేఖర్, సతీష్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.


Comments