బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వలసలు.
రఘునాథపల్లి మండలం మేకలగట్టు, గోవర్ధనగిరి సర్పంచుల చేరిక.
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మంగళవారం స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్ రెడ్డి, రఘునాథపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామ సర్పంచ్ ఇల్లందుల రవి తన వార్డు సభ్యులతో పాటు 50 మంది నాయకులు, కార్యకర్తలతో కాంగ్రెస్‌లో చేరారు. అలాగే గోవర్ధనగిరి గ్రామ సర్పంచ్ తోటకూర సదానందంతో పాటు వార్డు సభ్యులు ఉల్లి ఉపేంద్ర కుమారస్వామి, గొడుగు లావణ్య రాజు, వల్లెపు రాజు రజిత, నాయకులు మునిగాల మల్లేశం, వల్లెపు కుమార్, యువజన నాయకుడు జినుకుల సతీష్‌తో పాటు మరో 30 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారందరికీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అందరూ కలిసి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments