జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం.
రవికుమార్, తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు.
వనపర్తి,సెప్టెంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ భేదాలను పక్కనపెట్టి సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) వనపర్తి జిల్లా అధ్యక్షుడు రవికుమార్ అన్నారు. జేఏసీ అన్ని జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా పనిచేస్తుందని తెలిపారు.జేఏసీ వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా రవికుమార్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తోగరి కరుణాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జేఏసీ ఏ ఒక్క యూనియన్‌కు పోటీగా, ప్రత్యామ్నాయంగా కాదని, జర్నలిస్టుల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే సమన్వయ వేదిక అని పేర్కొన్నారు.జర్నలిస్టుల అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, ఇళ్ల స్థలాలు, బస్‌పాస్‌లు, వృద్ధాప్య భద్రత, ఉద్యోగ భద్రత తదితర సమస్యలపై సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత, సంస్థాగత, యూనియన్ భేదాలకు అతీతంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు.వనపర్తి జిల్లాలోని 15 మండలాలతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని రవికుమార్ చెప్పారు. జర్నలిస్టుల సమస్యలపై ఐక్యంగా నిలిస్తేనే బలమైన గొంతు వినిపించగలమన్నారు.అన్ని జర్నలిస్టు సంఘాలు, యూనియన్లు, వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు సమిష్టిగా ముందుకు వచ్చి హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని రవికుమార్ పిలుపునిచ్చారు. ఎవరు ఏ యూనియన్‌లో ఉన్నారన్నది కాదు.. జర్నలిస్టు సమస్యను ఎదుర్కొంటున్నాడా లేదా అన్నదే జేఏసీకి ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు.


Comments