హరిణి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి తుమ్మల.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబరు 23 (తెలంగాణ ముచ్చట్లు):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన హరిణి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హరిణి ఖమ్మంలో నర్సింగ్ చదువుతోంది. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన మరుసటి రోజే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని హరిణి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తు ఉన్న విద్యార్థిని దారుణ హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. మహిళల భద్రతకు విఘాతం కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నిందితులపై కఠినంగా వ్యవహరించి, చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హరిణి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.


Comments