గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
పుట్టలమ్మకుంటలో ఘనంగా నిమజ్జనం
వర్షంలోనూ కొనసాగిన గణపయ్యల శోభాయాత్ర
పకడ్బందీగా అధికారుల ఏర్పాట్లు
స్టేషన్ ఘన్‌పూర్,సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథులు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో మండపాల్లోని వినాయక విగ్రహాలను శోభాయాత్రగా ఊరేగిస్తూ భక్తులు పుట్టలమ్మకుంటకు తరలించి ఘనంగా నిమజ్జనం చేశారు.
డప్పు వాయిద్యాలు, డీజే సౌండ్లు, గణపతి బప్పా మోరియా నినాదాలతో పట్టణం మార్మోగింది. వర్షం కురుస్తున్నప్పటికీ యువత ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో కోలాటాలు ఆడుతూ సందడి చేశారు.
భద్రతకు పకడ్బందీ ఏర్పాట్లు
నిమజ్జనానికి ముందుగానే పుట్టలమ్మకుంట వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తుల భద్రత కోసం మున్సిపాలిటీ సిబ్బందికి రక్షణ కవచాలు అందుబాటులో ఉంచారు. రాత్రివేళల్లోనూ నిమజ్జనానికి ఇబ్బందులు కలగకుండా భారీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య శిబిరాన్ని అందుబాటులో ఉంచారు.
భారీ వినాయక విగ్రహాలను క్రేన్ సహాయంతో తెప్పలపైకి చేర్చి, తాళ్లు, కర్రల సహాయంతో మున్సిపాలిటీ సిబ్బంది వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిమజ్జనం చేశారు.పోలీసు, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. గురువారం కూడా నిమజ్జనం కొనసాగనుంది.
రాజవరం రిజర్వాయర్‌లో ఘనంగా గణపయ్యల నిమజ్జనం
చిల్పూర్: చిల్పూర్ మండలంలోని రాజవరం రిజర్వాయర్ కట్టపై వినాయక నిమజ్జనానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రదేశంలో విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.గ్రామాల్లో నిర్వహించిన గణనాథ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో ఆయా మండపాల నుంచి వినాయక విగ్రహాలను వాడవాడలా ఊరేగింపుగా తీసుకొచ్చారు. యువత నృత్యాలు, భక్తుల నినాదాల మధ్య రిజర్వాయర్ వద్ద గణనాథులకు ఘనంగా నిమజ్జనం నిర్వహించారు.


Comments