గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి.
గ్రామసభల తీర్మానాల మేరకే అభివృద్ధి పనులు చేపట్టాలి
తాగునీరు, రహదారులు, ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి
సంక్షేమ పథకాలు అర్హులందరికీ సకాలంలో అందాలి
– మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.గురువారం మంగపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిధిలోని 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతి, గ్రామాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, పంచాయతీ నిధుల వినియోగంపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గ్రామసభల ద్వారా గుర్తించి తీర్మానాలు చేయాలని సూచించారు. పనుల అవసరం, ప్రాధాన్యతను ప్రజల సమక్షంలో నిర్ణయించాలని, పూర్తయిన పనుల వివరాలను కూడా గ్రామసభలకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజలకు అత్యవసరమైన పనులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

తాగునీటి ట్యాంకుల మరమ్మతులు, పైపులైన్ల ఏర్పాటు, ఇతర తాగునీటి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించి తాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
ఉపాధి హామీ పనులతో గ్రామాలకు ప్రయోజనం
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలకు ఉపయోగపడే పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. వాగులపై చెక్‌డ్యామ్‌లు, వ్యవసాయ కుంటలు, భూగర్భ జలాల పెంపునకు బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో రహదారులు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.గ్రామాన్ని కన్నతల్లిలా భావించి పంచాయతీ కార్యదర్శులు బాధ్యతతో పనిచేయాలని అన్నారు. గ్రామంలోని ప్రతి సమస్యపై అవగాహన కలిగి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికతోపాటు గ్రామాభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలను పారదర్శకంగా రూపొందించాలని ఆదేశించారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని శుక్రవారం నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. రేషన్ కార్డులు లేని అర్హులకు దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. పింఛన్ దరఖాస్తులను త్వరగా పరిశీలించి ఉన్నతాధికారులకు పంపాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్‌రావు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ సోమయ్య, మండల ప్రత్యేక అధికారి డీపీవో వెంకయ్య, జిల్లా ఆత్మ చైర్మన్ చిటమట రఘు, కర్ల అరుణ, తహసీల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో బద్రు, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments