కడియం అభివృద్ధిపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్.
అభివృద్ధి చూడాలంటే క్షేత్రస్థాయిలో తిరిగి చూడాలి
కడియంను విమర్శిస్తే ఖబడ్దార్
కాంగ్రెస్ నాయకులు
స్టేషన్ ఘన్‌పూర్,సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు కౌంటర్‌గా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు జూలకుంట్ల శిరీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిపై మాట్లాడారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే కడియం శ్రీహరి పనిచేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగానే వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. డిగ్రీ కళాశాల, వంద పడకల ఆసుపత్రిని తామే తీసుకొచ్చామని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం సరికాదన్నారు. ఇందుకు సంబంధించిన జీవో ఎక్కడ ఉందని, స్థల సేకరణ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న ఏర్పడగా, వంద పడకల ఆసుపత్రికి 2025 జనవరి 20న అనుమతులు వచ్చాయని తెలిపారు. ఆర్టీసీకి కేటాయించిన సర్వే నంబర్ 760/1లోని నాలుగు ఎకరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆసుపత్రి కోసం కేటాయించిన ఘనత కడియం శ్రీహరికే దక్కుతుందని పేర్కొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ, డిగ్రీ కళాశాల, సమీకృత గురుకుల సముదాయాలు కడియం శ్రీహరి కృషితోనే సాధ్యమయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. 2001లో దేవాదుల ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు తీసుకొచ్చి దేవాదుల ప్రాజెక్టు ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడాలంటే క్షేత్రస్థాయిలో పర్యటించి చూడాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. కడియం శ్రీహరిని విమర్శించే ముందు నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధిని గుర్తించాలని సూచించారు. కడియం శ్రీహరిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
సమావేశంలో కౌన్సిలర్ పొన్న రవి, కోఆప్షన్ సభ్యులు గన్ను నరసింహులు, మాషూక్, వార్డు అధ్యక్షులు మామిండ్ల శ్రీనివాస్, మునిగల మధు, సీనియర్ నాయకులు బూర్ల శంకర్, నీల గట్టయ్య, పోగుల సారంగపాణి, గట్టు రమేష్, పెసరు సారయ్య, తిరుమలనాథ స్వామి, డైరెక్టర్ గట్టు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


Comments