ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా ఏదీ?
దిగుమతి సుంకం తగ్గింపుపై మంత్రి తుమ్మల ఆగ్రహం.
సత్తుపల్లి, సెప్టెంబరు 24 (తెలంగాణ ముచ్చట్లు):
ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడం సరికాదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకవైపు దేశంలో ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని, రైతులను ఈ పంట వైపు ప్రోత్సహించాలని చెబుతూ.. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై సుంకాన్ని తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ నిర్ణయం దేశీయ ఆయిల్‌పామ్ రైతుల్లో అనిశ్చితికి దారితీసే అవకాశం ఉందన్నారు. క్రూడ్ పామాయిల్‌పై మొత్తం దిగుమతి సుంకాన్ని 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విదేశీ పామాయిల్ దిగుమతులకు పోటీ ప్రయోజనం పెరిగి, దేశీయ ఆయిల్‌పామ్ గెలల ధరలపై ఒత్తిడి పడే అవకాశం ఉందని తుమ్మల పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కోరుతున్న సమయంలో కేంద్రం సుంకాన్ని తగ్గించడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. ఆయిల్‌పామ్ దీర్ఘకాలిక పంట కావడంతో రైతులు మొక్కలు నాటిన నాటి నుంచి ఏళ్లపాటు పెట్టుబడులు పెట్టి సాగు చేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. నీరు, ఎరువులు, నిర్వహణకు భారీగా వ్యయం చేయాల్సి ఉంటుందని, ఇలాంటి పంటకు మార్కెట్ ధరలో స్థిరత్వంతో పాటు విధానపరమైన భరోసా అవసరమన్నారు. పంట సాగులోకి వచ్చిన తర్వాత దిగుమతి విధానాల్లో మార్పులు చేస్తే నష్టపోయేది రైతులేనని పేర్కొన్నారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపడుతోందని తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3.20 లక్షల ఎకరాల్లో 88 వేలకుపైగా రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని చెప్పారు. పెట్టుబడి రాయితీలు, మొక్కల విస్తరణ, డ్రిప్ ఇరిగేషన్, మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, రిఫైనరీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. దేశంలో వంట నూనెల అవసరాల్లో గణనీయమైన భాగం దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయ ఆయిల్‌పామ్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ప్రకటించిన ఎన్‌ఎంఈఓ–ఓపీ లక్ష్యాలకు అనుగుణంగా దేశీయ సాగును ప్రోత్సహించాల్సిన సమయంలో దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రైతుల్లో నమ్మకం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. తాజా ఆయిల్‌పామ్ గెలలు (ఎఫ్‌ఎఫ్‌బీ)కు టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధర కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని మంత్రి తెలిపారు. రైతు ఆదాయం పెంచాలంటే ముందుగా పంటకు ధర భరోసా కల్పించాలని, దేశీయ రైతు ఉత్పత్తికి గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ దిగుమతులను చౌక చేసే విధానాల కంటే దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తెలంగాణ రైతులు నమ్మకంతో ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చారని, వారి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తుమ్మల పేర్కొన్నారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే పునఃసమీక్షించాలని, దేశీయ ఆయిల్‌పామ్ రైతులకు ధర భరోసా కల్పించే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌ఎఫ్‌బీలకు టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.


Comments