బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంపై చిల్పూర్ గ్రామస్తుల్లో అసంతృప్తి.
చిల్పూర్,సెప్టెంబర్24(తెలంగాణ ముచ్చట్లు):
చిల్పూర్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయం తమ గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నప్పటికీ, దేవాదాయ శాఖ అధికారుల వ్యవహారశైలిలో గ్రామస్తులకు తగిన ప్రాధాన్యం, గౌరవం లభించడం లేదనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.గతంలో గ్రామం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే సంత ప్రస్తుతం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంలో కూడా గ్రామ ప్రజల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.
అలాగే ఆలయంలో నిర్వహించే పూజలు, ప్రత్యేక కార్యక్రమాలకు గ్రామస్తులకు ముందస్తు సమాచారం లేదా ఆహ్వానం ఇవ్వడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఆలయ పరిసరాల్లో ఉండే ప్రజలు, గ్రామస్తులతో అధికారులు కనీస మర్యాదతో వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
“మా ఊరి దేవుడు.. కానీ మా ఊరి ప్రజలకే గౌరవం లేదు” అనే భావన కొంతమంది గ్రామస్తుల్లో నెలకొంది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి సంకోచిస్తున్నప్పటికీ, తమ మనసులో ఉన్న ఆవేదనను ఏదో ఒకరోజు మీడియా మిత్రుల సమక్షంలో బహిరంగంగా వెల్లడించాల్సిన పరిస్థితి వస్తుందని పలువురు గ్రామస్తులు అంటున్నారు.ఆలయ అభివృద్ధి, నిర్వహణతో పాటు గ్రామస్తుల మనోభావాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, ఆలయ అధికారులు–గ్రామ ప్రజల మధ్య సమన్వయం పెంచాలని స్థానికులు కోరుతున్నారు.


Comments