భూముల రీ సర్వేపై గ్రామసభ.
కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులకు అవగాహన కల్పించిన అధికారులు.
పెద్దమందడి,సెప్టెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామపంచాయతీలో భూముల రీ సర్వేపై గ్రామసభ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో తహసీల్దార్ మల్లికార్జున్ పాల్గొని రీ సర్వే ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించారు.పెద్దమందడి మండలంలోని బలిజపల్లి, జంగమయ్యపల్లి, వీరాయపల్లి, అల్వాలగట్ల, ఖానాపూర్ గ్రామాల్లో రైతుల భూములకు సంబంధించి రీ సర్వే నిర్వహించనున్నట్లు తహసీల్దార్ మల్లికార్జున్ తెలిపారు. భూముల హద్దులు, విస్తీర్ణం, ఇతర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.భూ హక్కుల పరిరక్షణతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా భూముల వివరాలను పక్కాగా నమోదు చేయడమే రీ సర్వే ఉద్దేశమని తెలిపారు. రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకుని, హద్దులు లేదా విస్తీర్ణంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.రీ సర్వే పనులకు రైతులు సహకరించాలని తహసీల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Comments