ఫతేపూర్ పాడి రైతులకు రుణ సదుపాయం.
విజయ డైరీ, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు ఆధ్వర్యంలో అవగాహన సమావేశం
తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాం
చిల్పూర్, సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
విజయ డైరీకి పాలు పోసే పాడి రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించేందుకు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం చిల్పూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో పాడి రైతులతో బ్యాంకు ప్రాంతీయ అధికారి ఉదయ్ ముక్తాపురం, తాటికొండ శాఖ నిర్వాహకుడు శోభన్ బాబు సమావేశమై రుణ సదుపాయంపై అవగాహన కల్పించారు.విజయ డైరీ, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా డైరీకి పాలు పోసే పాడి రైతులకు సులభతరంగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతుల రుణ చెల్లింపు చరిత్ర ఆధారంగా తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. ఒక్కో రైతుకు రెండు గేదెల కొనుగోలు లేదా రూ.2 లక్షల వరకు రుణం అందించే అవకాశం ఉందని తెలిపారు.
రుణ మొత్తంలో 90 శాతం వరకు బ్యాంకు రుణంగా అందిస్తుందని, మిగిలిన 10 శాతం రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. డైరీ ద్వారా వచ్చే ఆదాయం నుంచి నెలవారీ వాయిదాలు చెల్లించే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.ఫతేపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తాటికొండ శాఖలో ఖాతాలు తెరిచి రుణ సదుపాయం పొందాలని బ్యాంకు నిర్వాహకులు సూచించారు.ఈ సమావేశంలో ఫతేపూర్ విజయ డైరీ అధ్యక్షుడు బానోతు బాలరాజు, సర్పంచ్ లక్ష్మి–ఉమ్లా నాయక్, మాజీ సర్పంచ్ రూప్లా నాయక్, మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి, పాడి రైతులు పాల్గొన్నారు.


Comments