చిడతల భజనలతో మార్మోగిన ఇప్పగూడెం వీధులు!.
డీజేలకు స్వస్తి.. సంప్రదాయమే మా ఇష్టం
ఇప్పగూడెం భక్తుల సరికొత్త ట్రెండ్
భక్తిపారవశ్యంలో గణనాథుడి శోభాయాత్ర
స్టేషన్ ఘన్‌పూర్,సెప్టెంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
గణపతి నవరాత్రి ఉత్సవాల సందడి స్టేషన్ ఘన్‌పూర్ మండలంలో మిన్నంటింది. మండలంలోని ఇప్పగూడెంలో నిర్వహించిన గణపతి శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ శబ్దాలతో కూడిన డీజేలు, డప్పులకు భిన్నంగా భక్తులు సంప్రదాయ పద్ధతిలో చిడతల భజనలతో గణనాథుడిని వీధుల్లో ఊరేగించారు.ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై కొలువుదీరిన వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల నినాదాలతో గ్రామ వీధులు మార్మోగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొని భక్తిగీతాలు, భజనలు ఆలపిస్తూ ఉత్సవానికి మరింత శోభను తీసుకొచ్చారు.డీజేలకు దూరంగా సంప్రదాయ భజనలతో శోభాయాత్ర నిర్వహించడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామంలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.


Comments