చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం.
పలుస శంకర్ గౌడ్,జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .
వనపర్తి,సెప్టెంబర్26(తెలంగాణ ముచ్చట్లు):
భూస్వాముల దౌర్జన్యాలకు ఎదురొడ్డి భూమి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. వనపర్తిలో చాకలి ఐలమ్మ 131వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆమె తెగువ, త్యాగం, ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. స్త్రీ శక్తికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో యువతకు ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ‘జోహార్ చాకలి ఐలమ్మ’ అంటూ నినాదాలు చేశారు.కార్యక్రమంలో జైభీం సేవా సంఘం అధ్యక్షులు బండారు శ్రీనివాస్, గంధం నాగరాజు, భారత రాష్ట్ర సమితి నాయకుడు పరంజ్యోతి, యువశక్తి ఫౌండేషన్ అధ్యక్షులు మధు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments