250 వారాలుగా నిరంతర అన్నదానం.. మతీన్ & ఫ్రెండ్స్ ట్రస్ట్ సేవాభావం.
*పేదలు, కూలీలు, చిరు వ్యాపారులకు ఆపన్నహస్తం*
*ఐదేళ్లుగా ప్రతి శనివారం కొనసాగుతున్న ఉచిత భోజన సేవ*
*ట్రస్ట్ సభ్యుల సేవా స్ఫూర్తిని అభినందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ*
కరీంనగర్, సెప్టెంబర్ 26(తెలంగాణ ముచ్చట్లు ):
జిల్లా కేంద్రంలోని శనివారం మార్కెట్‌లో మతీన్ & ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం 250 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక అన్నదాన కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
దాదాపు ఐదేళ్లుగా ప్రతి శనివారం ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం పేద ప్రజలు, చిరు వ్యాపారులు, రైతులు, కూలీలకు ఆకలి తీర్చే ఆపన్నహస్తంగా నిలిచిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 250 వారాలుగా వేలాది మందికి ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమన్నారు.
అన్నదానం అన్ని దానాల్లోకెల్లా ఉత్తమమైనదని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అని డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇంతకాలం నిరంతరాయంగా కార్యక్రమాన్ని నిర్వహించడం సులభమైన విషయం కాదని, మతీన్ & ఫ్రెండ్స్ ట్రస్ట్ సభ్యుల సేవా స్ఫూర్తిని అభినందించారు. ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపార సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 250 వారాల మైలురాయిని పురస్కరించుకుని ప్రత్యేకంగా పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. భవిష్యత్తులోనూ ఈ
సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు.


Comments