అక్షరాస్యతతో మహిళ సాధికారిత సాధ్యం.
కొమ్ము రాధమ్మ, గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు.
పెద్దమందడి,సెప్టెంబర్27(తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉల్లాస్ – నవభారత్ సాక్షరతా కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వయోజన మహిళలకు అక్షరాస్యత పరీక్షలు నిర్వహించారు. గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు కొమ్ము రాధమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కొమ్ము పెంటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కొమ్ము రాధమ్మ మాట్లాడుతూ.. 15 సంవత్సరాలు దాటిన నిరక్షరాస్య మహిళలకు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం వంటి అంశాలతో పాటు బ్యాంకింగ్ సేవల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, ఓటరు చైతన్యం తదితర జీవన నైపుణ్యాలను అందించడమే ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహిళలు అక్షరాస్యులుగా మారడం ద్వారా తమ కుటుంబాల అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించగలరని అన్నారు. గ్రామంలోని వయోజన మహిళలందరూ ప్రభుత్వం అందిస్తున్న అక్షరాస్యత కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ముఖ్య అతిథి సర్పంచ్ కొమ్ము పెంటయ్య మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధికి విద్య ఎంతో అవసరమని, ప్రతి మహిళ అక్షరాస్యత సాధించడం ద్వారా కుటుంబంలో పిల్లల చదువుపై కూడా మంచి ప్రభావం ఉంటుందని అన్నారు. గ్రామంలోని మహిళలు ఉత్సాహంగా అక్షరాస్యత పరీక్షలకు హాజరై పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘం కోశాధికారి శారద, కార్యదర్శి తిరుపతమ్మ, పారిజాతమ్మ, బుసాని లలితమ్మ, కొమ్ము శారద, నార్వ వెంకటమ్మ, బండాలమ్మ, పద్మ, జంగం పద్మ, స్వాతి, ఊశనమ్మతో పాటు పలువురు మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


Comments